ఓ తల్లి తన బిడ్డకి జో కొడుతూ కధ చెప్తోంది .
ఆ బిడ్డ పదునాలుగు భువనాలు తన బొజ్జలో దాచుకున్న వాడు . అందుకనే ఆ తల్లిది అదృష్టం అన్నారు అంతా .
" ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా యేమి నోము నోచె ఈ యశోద " అంటూ !
అవును ఆ అమ్మ యశోదమ్మే ! ఆ అల్లరి వాడు , గొల్ల వాడు , రేపల్లె బాలుడు మన క్రిష్ణయ్యే !రోజు రోజుకీ అల్లరి పెరిగిపోతుందనేమో అల్లరి క్రిష్ణయ్యకి రాముడి కధ చెప్తోంది . గోపాల బాలుడికి కోదండ పాణి కధ. గీతాకారుడికి సీతాపతి కధ .
ఇదిగో ఇదే ఆ కధ
రామో నామ
బభూవ ‘హూం ‘ తదబలా
సీతేతి ‘హూం ’ తాం పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
నిద్రార్ధం జననీ కధామితి హరే: హూంకార శృణ్వతః
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర:
పాంతు వ: - కృష్ణ కర్ణామృతం అనగనగా రాముడనే రాజు ఉండెను - ఊ
ఆతని భార్య సీతమ్మ - ఊ
పితృ వాక్య పరిపాలన గావిస్తూ పంచవటీ వనం లో నుండగా రావణుడు అపహరించెను
లక్ష్మణా ! నా ధనువెక్కడ ...ధనువెక్కడ ...ధనువెక్కడ ? ..
అనుచు పల్కిన కృష్ణుడు మనలను రక్షించు గాక !
సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణయ్య రాముడయ్యాడు . అనుజుడు లక్ష్మణుడినీ తలుచుకున్నాడు .
ఈ పద్యం మొదటి సారి చాగంటి వారు చెప్పినప్పుడు విన్నాను . వారి చక్కని వ్యాఖ్యానం మీరు కూడా ఇక్కడ వినచ్చు .
ఇంత చక్కటి పద్యం తెలుగు లో చదువుకుంటే బాగుంటుంది కదా ! ద్రాక్షారామం లో జరిగిన శతావధానం లో గరికపాటి వారికి చక్కటి సమస్య ఇచ్చారు . ఈ పద్యం స్ఫూర్తి తోనే వారూ పూరించారు
సమస్య : ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్
పూరణ :
తనువన్ వాల్చిన బాల కృష్ణుని యశోదా దేవి గీతంబులం
దున జోల్వాడుచూ రామ గాధల మహత్తు( దెల్ప ఊ కొట్టుచున్
దనుజేంద్రుడా జనకాత్మజన్ గొనెనాన్ ఆత్రంబునన్ లేచి నా
ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్ !
మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు .
( అప్పుడప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలు ఇక్కడ పంచుదామనే ఉద్దేశ్యం తోనే ఈ బ్లాగ్ . కొన్ని పద్యాలు విని రాసుకున్నవి కాబట్టి దోషాలు ఉండవచ్చు . తెలియచేస్తే సరి చేస్తాను )
మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు .
( అప్పుడప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలు ఇక్కడ పంచుదామనే ఉద్దేశ్యం తోనే ఈ బ్లాగ్ . కొన్ని పద్యాలు విని రాసుకున్నవి కాబట్టి దోషాలు ఉండవచ్చు . తెలియచేస్తే సరి చేస్తాను )
చక్కని పద్యంతో మొదలుపెట్టావు. శుభం.
ReplyDeleteThanks abbaay
Delete