Saturday 6 June 2015

ఆశువుల్ వల్లించు అవధాన విద్య లో జగతి ముక్కున వ్రేలు జాతి నాది !! ( అవధాన విద్య - 1 )

" ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం "    ~~ అప్పయ్య దీక్షితులు
                                        ఆంధ్రుడిగా జన్మించడం ,ఆంద్ర భాష రెండూ పూర్వ జన్మ ఫలం
సింధు నదియిన్ మిశై నిల విని లే చేర నన్నాట్టిళం పెన్ గళుడనే
సుందర తెలుంగు నిఱ్ పాట్టి శైత్తు త్తోణిగ ళోట్టి విళైయాడి వరువోం.
                                                         ~~ సుబ్రహ్మణ్య భారతి
 పండబారిన వెన్నెల రాత్రిలో,
 చేరదేశపు చెలులు దగ్గర ఉండగా,
 చక్కటి తెలుగు పాట పాడుతూ ,
 సింధు నదిని పడవ నడుపుదాం.
                                            కన్నడ రాయల వారు ఇక్కడకి వచ్చి దేశ భాషలందు తెలుగు లెస్స అంటారు ..ఇక్కడి పండిత రాయలు అక్కడ ఢిల్లీ పీఠం మీద తన ధారణా పటిమ తో అందరినీ ఆశ్చర్య పరుస్తాడు ..ఇది తెలుగు భాషకీ తెలుగు వాడికీ మాత్రమే సాధ్యమా ? ఎందుకీ భాష మీద ఇంత మక్కువ ? ఈ తెలుగు వాడి గొప్పతనం ఏంటి ? ఈ భాష సొబగులని ప్రదర్శించే కళ ఏది ?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేంతటి వాడిని కాదు గానీ , అప్రస్తుత ప్రసంగం మాత్రం చేస్తాను .
ఒక్క సారి సరస్వతీ మాతని తలుచుకుందాం ఆ తర్వాత దేవదాసు పార్వతీ కల్యాణం చూసి వద్దాం !!
                     ****** ******* *******                      ********** ************
సరస్వతీ మాత :
భారతీ హాసమంతయు ప్రబలునెడల
అంతమన్నాడ అజ్ఞానమనెడి అరికి
పూల దోయిలియా నాదు బుద్ధి యనగా
అమ్మ ,నీకర్పణము ! వాక్ ప్రియాంక చరితా !
                                                      ~~ మేడసాని మోహన్ గారు

తల్లీ ! భారతీ ! నీ చిరునవ్వు నా అజ్ఞానమనెడి శత్రువుని అంతమొందిస్తుంది .ఇదిగో నా బుద్దిని నీకర్పిస్తున్నాను పూల దోసిలిగా !  

సరస్వతీ దేవినే తలుచుకుంటున్నారుగా  ... మరొక్క సారి పద్యం చదువుకోండి
దేవదాసు పార్వతి కధ సుఖాంతమైంది అనుకుందాం ..దేవదాసు పార్వతిని మనువాడటానికి కళ్యాణ మంటపానికి వచ్చాడు ఇదిగో దేవదాసు మనసు ఇలా తేట గీతి (తెలుగు) లో ఉప్పొంగింది

శైశవము నుండి హృదయాలు సంగమింప
పడుచు గుండెలు సన్నాయి పాట పాడె
మనువు గూడగ నిలిచితి మంటపాన
తరుణీ ! రమ్మిక ప్రణయ సంతర్పణముగా !
                                                                                            ~~ నరాల రామిరెడ్డి గారు .
పద్యం బాగుంది కదా , పెళ్లి మండపం లో చిన్ననాటి తలపులతో పడుచు గుండెలు సన్నాయి పాటలు పాడాయిట.
ఆ జంటని ఆశీర్వదదిద్దాం అనుకుంటూ అడుగులేస్తున్నారా ? జాగ్రత్త ..
మొదటి అడుగుకే మీకొక శవం అడ్డొస్తుంది ..రెండో అడుగుకి పాడె ..మూడో అడుగుకి చితి మంట ..నాలుగో అడుగుకి తర్పణం . ఈ పదాలన్నీ ఎలా ఇమిడాయి అనుకుంటున్నారా ? ఒకానొక అవధానం లో నరాల రామా రెడ్డి గారు చెప్పిన పద్యమిది . ఇప్పుడు పద్యం మరింత అందం గా ఉంది కదూ !
మళ్ళీ సరస్వతీ దేవి వర్ణన చదవండి ..ఇప్పుడు మీకు పలుకులమ్మ తో పాటు కులుకులమ్మలు కూడా కనపడతారు సమంత, తమన్నా , ఇలియానా ,ప్రియాంక !  ఏ భాష పదాలివి ఎక్కడివి ? ఎక్కడ సరస్వతీ దేవి వర్ణన ? అందులోనూ క్షణాల్లో పద్యం ఎలా కట్టారు ? అన్నీ అద్భుతాలు కదూ !
                     “ ఈ ప్రపంచం లో మరే భాషకీ లేని అద్భుత శక్తి ఈ భాష కి ఉంది . అన్య భాషా పదాలని సైతం తన లో ఇముడ్చుకోగల మార్మిక సౌందర్యం ఈ భాష సొంతం . ఈ భాష సొబగులు అవధాన కళ ద్వారా మరింత ప్రస్ఫుటమవుతాయి .ఆ అందాన్ని మరింతగా పది మందికి చేరువ చేయడమే అవధాని లక్ష్యం “  
                                                       ~~ దివాకర్ల వెంకటావధాని గారు
            ఏ భాష చెణుకైనా, ఏ యాస చినుకైనా తనలోన కలుపుకొని తరలింది తెలుగు” ~~ సి నా రే
ఇదీ తెలుగు భాషంటే ! మరి తెలుగు వాడంటే ఏంటో చూస్తారా ?
                        సాగర తీరాన మహా సహస్రావధానం జరుగుతోంది ..వెయ్యి పద్యాలు అప్పటికప్పుడు చెప్పి ధారణ చేసి చెప్పడమంటే సాధ్యమయ్యే విషయమా ? ఆ పనికి పూనుకోవడమే పెద్ద సాహసం . ఒక్క ఏమరపాటు చాలు ధారణ తప్పడానికి . గంగా ప్రవాహానికి అడ్డు కట్ట వెయ్యడానికి . ఒక్క అవహేళన చాలు , అవధాని ఏకాగ్రత దెబ్బ తీయడానికి .
దత్తపదులు సాగుతున్నాయి .
అయ్యా , అవధాని గారూ ,మీరు చేస్తున్న సహస్రావధానాన్ని వర్ణించండి .ఇదిగో పదాలు
“ కుక్క “ , “తోక” , “పట్టి “ , “గోదావరి”
ఒక్క క్షణం వేరేగా ఆలోచిస్తేనో , హేళన గా భావిస్తేనో పద్యం ఆగిపోదూ ?

మాకుక్క పోతలైనవి
ఈ కర్కశ దత్తపదములెంతో కలచెన్
మీకై పట్టిన పట్టున
గోకై మా కవితలెల్ల గోదావరులౌ !
( గోకు - నేతికుండలో నడుగున నట్టవలె నుండు వస్తువు )
అయ్యా ! మీరు పట్టిన పట్టు వల్ల ఇదిగో మా పద్యాలు గోదావరిలా ఉప్పొంగాయి.
ఏ జంకూ బొంకూ లేకుండా అవధాని ఎంత చక్కగా తిప్పి కొట్టారు ! వారే మన గరికపాటి !  
కేవలం భాష మీద పట్టు ఉంటేనే చెప్పే పద్యమా ఇది .కాదే ! మాటకు మాట చెప్పే తెలుగు వాడి సత్తా కావాలి .
             ఇంతటి గొప్ప కళ ఈ భాష కే సొంతం .ఆ ధారణా శక్తీ తెలుగు వాడికే సాధ్యం .ఇది కేవలం తెలుగు వాడన్న మాట కాదు . మళ్ళీ అడ్డంకులు లేని అప్రస్తుతం -
అవి ఇరవయ్యో శతాబ్దపు తొలి రోజులు .
పలుకులమ్మ దయతో “ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము  అంటూ దేశమంతా సన్మానాలు పొందిన తిరుపతి వేంకట కవులు అడయార్ లో అవధానం చేస్తున్నారు . వ్యస్తాక్షరి కత్తి మీద సాము లా సాగింది. ఎనభై నాల్గు అక్షరాల ధారణ .
దోస మటం చెరింగియు దుందుడు కొప్పగ పెంచి నారమీ
  మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు   
 అంటూ సవాల్ చేసిన తిరుపతి కవుల ధారణ అది .ధార లో రెండు భాషలేమో , ధారణ లో ఏకంగా ఇంగ్లీష్ , అరబ్బీ , సంస్కృతం , ఇలా అన్ని భాషల పదాలను కలగాపులగం గా ఇస్తే చేసిన రాక్షస ధారణ
శా.యూయం తత్త్ర సిడౌన్ తథాపి వెరివెల్ తస్మాన్మమాయా శశీ,
నోగో సార్ మదరాసు కాయ కరితం హింగేందు బాయేందునం
                                    నింగత్పూరయ నింగకూద విడుదల్ నీవాడనంటిన్ గదా
                                   కిస్వాస్తే మయి బోల్తహుం అజి సునో తక్సీర్నమేరే ఉపర్
      ఈ అవధానం చూసిన అనీబిసెంట్ దొరసాని “మీ ధారణా శక్తి ఎంతటిదీ “ అంటూ కొనియాడారుట. పాశ్చాత్య దేశాలలో ఇట్టి విద్య లేదని ప్రశంసించారుట.
అవధాన విద్య మీద పరిశోధనా గ్రంధాన్ని అందించిన సుబ్బన్న శతావధాని గారు చెప్పిన మాట చెప్పి ఈ అప్రస్తుతానికి స్వస్తి పలుకుతాను .
అవధాన విద్య ఆంధ్రుల ఉపజ్ఞోపనత విద్య
అవధాన విద్య అనన్యాదృక్ష విద్య
అవధాన విద్య తత్తాదృక్ష విద్య  
 ( అక్కడక్కడా చూసిన అవధానాల నుండి రాసుకున్న కబుర్లు . తప్పొప్పులు చెప్తే చక్కగా సరిదిద్దుతాను ) 

Thursday 1 January 2015

శ్రీ రామ !


ఓ తల్లి తన బిడ్డకి జో కొడుతూ కధ చెప్తోంది . 
ఆ బిడ్డ పదునాలుగు భువనాలు తన బొజ్జలో దాచుకున్న వాడు . అందుకనే ఆ తల్లిది అదృష్టం అన్నారు అంతా .
" ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా యేమి నోము నోచె ఈ యశోద " అంటూ !
అవును ఆ అమ్మ యశోదమ్మే ! ఆ అల్లరి వాడు , గొల్ల వాడు , రేపల్లె బాలుడు మన క్రిష్ణయ్యే !రోజు రోజుకీ అల్లరి పెరిగిపోతుందనేమో అల్లరి క్రిష్ణయ్యకి రాముడి కధ  చెప్తోంది . గోపాల బాలుడికి కోదండ పాణి కధ. గీతాకారుడికి సీతాపతి కధ . 

ఇదిగో ఇదే ఆ కధ 


రామో  నామ బభూవ  ‘హూం ‘ తదబలా సీతేతి ‘హూం ’ తాం పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
నిద్రార్ధం జననీ కధామితి హరే: హూంకార శృణ్వతః 
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:     - కృష్ణ కర్ణామృతం 

అనగనగా రాముడనే రాజు ఉండెను - ఊ 
ఆతని భార్య సీతమ్మ - ఊ 
పితృ వాక్య పరిపాలన గావిస్తూ పంచవటీ వనం లో నుండగా రావణుడు అపహరించెను 
లక్ష్మణా ! నా ధనువెక్కడ ...ధనువెక్కడ ...ధనువెక్కడ ? .. 
అనుచు పల్కిన కృష్ణుడు మనలను రక్షించు గాక ! 

సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణయ్య రాముడయ్యాడు . అనుజుడు లక్ష్మణుడినీ తలుచుకున్నాడు . 
ఈ పద్యం మొదటి సారి చాగంటి వారు చెప్పినప్పుడు విన్నాను . వారి చక్కని వ్యాఖ్యానం మీరు కూడా  ఇక్కడ వినచ్చు . 

ఇంత చక్కటి పద్యం తెలుగు లో చదువుకుంటే బాగుంటుంది కదా ! ద్రాక్షారామం లో జరిగిన శతావధానం లో గరికపాటి వారికి చక్కటి సమస్య ఇచ్చారు . ఈ పద్యం స్ఫూర్తి తోనే వారూ పూరించారు 
సమస్య :  ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్ 
పూరణ : 
తనువన్ వాల్చిన బాల కృష్ణుని యశోదా దేవి గీతంబులం
దున జోల్వాడుచూ రామ గాధల మహత్తు( దెల్ప ఊ కొట్టుచున్  
దనుజేంద్రుడా జనకాత్మజన్ గొనెనాన్ ఆత్రంబునన్ లేచి నా 
ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్  ! 


మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు . 

( అప్పుడప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలు ఇక్కడ పంచుదామనే ఉద్దేశ్యం తోనే ఈ బ్లాగ్ . కొన్ని పద్యాలు విని రాసుకున్నవి కాబట్టి దోషాలు ఉండవచ్చు . తెలియచేస్తే సరి చేస్తాను )