Thursday, 1 January 2015

శ్రీ రామ !


ఓ తల్లి తన బిడ్డకి జో కొడుతూ కధ చెప్తోంది . 
ఆ బిడ్డ పదునాలుగు భువనాలు తన బొజ్జలో దాచుకున్న వాడు . అందుకనే ఆ తల్లిది అదృష్టం అన్నారు అంతా .
" ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా యేమి నోము నోచె ఈ యశోద " అంటూ !
అవును ఆ అమ్మ యశోదమ్మే ! ఆ అల్లరి వాడు , గొల్ల వాడు , రేపల్లె బాలుడు మన క్రిష్ణయ్యే !రోజు రోజుకీ అల్లరి పెరిగిపోతుందనేమో అల్లరి క్రిష్ణయ్యకి రాముడి కధ  చెప్తోంది . గోపాల బాలుడికి కోదండ పాణి కధ. గీతాకారుడికి సీతాపతి కధ . 

ఇదిగో ఇదే ఆ కధ 


రామో  నామ బభూవ  ‘హూం ‘ తదబలా సీతేతి ‘హూం ’ తాం పితు
ర్వాచా పంచవటీ వనే విహరతస్తామాహరద్రావణ:
నిద్రార్ధం జననీ కధామితి హరే: హూంకార శృణ్వతః 
సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధనురితి ప్రోక్తా: గిర: పాంతు వ:     - కృష్ణ కర్ణామృతం 

అనగనగా రాముడనే రాజు ఉండెను - ఊ 
ఆతని భార్య సీతమ్మ - ఊ 
పితృ వాక్య పరిపాలన గావిస్తూ పంచవటీ వనం లో నుండగా రావణుడు అపహరించెను 
లక్ష్మణా ! నా ధనువెక్కడ ...ధనువెక్కడ ...ధనువెక్కడ ? .. 
అనుచు పల్కిన కృష్ణుడు మనలను రక్షించు గాక ! 

సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణయ్య రాముడయ్యాడు . అనుజుడు లక్ష్మణుడినీ తలుచుకున్నాడు . 
ఈ పద్యం మొదటి సారి చాగంటి వారు చెప్పినప్పుడు విన్నాను . వారి చక్కని వ్యాఖ్యానం మీరు కూడా  ఇక్కడ వినచ్చు . 

ఇంత చక్కటి పద్యం తెలుగు లో చదువుకుంటే బాగుంటుంది కదా ! ద్రాక్షారామం లో జరిగిన శతావధానం లో గరికపాటి వారికి చక్కటి సమస్య ఇచ్చారు . ఈ పద్యం స్ఫూర్తి తోనే వారూ పూరించారు 
సమస్య :  ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్ 
పూరణ : 
తనువన్ వాల్చిన బాల కృష్ణుని యశోదా దేవి గీతంబులం
దున జోల్వాడుచూ రామ గాధల మహత్తు( దెల్ప ఊ కొట్టుచున్  
దనుజేంద్రుడా జనకాత్మజన్ గొనెనాన్ ఆత్రంబునన్ లేచి నా 
ధనువుందీయుము లక్ష్మణా యని యశోదాసూనుడాత్రంబుగన్  ! 


మిత్రులందరికీ వైకుంఠ ఏకాదశి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు . 

( అప్పుడప్పుడు చదువుకున్న కొన్ని పద్యాలు ఇక్కడ పంచుదామనే ఉద్దేశ్యం తోనే ఈ బ్లాగ్ . కొన్ని పద్యాలు విని రాసుకున్నవి కాబట్టి దోషాలు ఉండవచ్చు . తెలియచేస్తే సరి చేస్తాను )